ప్రతిపక్షాలు ప్రజాసంఘాల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి
థాట వేత ధోరణి అధికారపక్షంపై వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం.
విలువలతో కూడిన, నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టకపోవడమే బారాస ప్రభుత్వంపై ఉమ్మడి పోరుకు కారణమని విశ్లేషకుల భావన.
అధికార పార్టీకి మరొక రూపమే ప్రభుత్వం. ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీని ప్రభావితం చేస్తుంటే పార్టీ అధికారo ముసుగులో అక్రమాలు అకృత్యాలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా ఇది దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలోనూ అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి క్రమం . ప్రజలను, ప్రజాస్వామి కవాదులను, విపక్షాలను పట్టించుకోకుండా ఒక్కసారి అధికారానికి వస్తే రాష్ట్రము దేశము తమదే అనే గర్వంతో అహంకారంతో విర్రవేగే పాలకులు ప్రజలను బానిసలుగా, విపక్షాలు ప్రజాసంఘాలను ఖాతరు చేయకుండా చేస్తున్న పరిపాలన అనేక విమర్శలకు ఆరోపణలకు గందరగోళానికి దారితీస్తున్న విషయాన్ని పాల కపక్షాలు గమనించాలి. ప్రభుత్వ ముసుగులో అధికార పార్టీలు చేస్తున్నటువంటి ఆగడాలను ఆపవలసిన అవసరముంది. నిజాం నిరంకుశ పాలన సందర్భంలో కూడా నిజాం రాజు మంచివాడే నిర్మాణాలు సౌకర్యాలు చేపట్టి ప్రజల కోసం పనిచేశాడని పేరు ఉన్నప్పటికీ అతని అనుచరులుగా ఆధీనంలో పనిచేసిన టువంటి కాశీం రాజ్వి అతని నాయకత్వంలో పనిచేసినటువంటి ప్రైవేట్ సైన్యం రజాకార్లు క్రింది స్థాయిలో ఉన్నటువంటి దేశముఖలు జమీందారులు ప్రజలను పీల్చిపిప్పి చేసి ఆగడాలకు దోపిడీలకు కారణమైనటువంటి క్రింది స్థాయి వర్గాలను అదుపులో చేయని కారణంగా నిజాం రాజు కూడా నిరంకుశుడు దోపిడీదారు అని పేరు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ అధినేత తన పార్టీని అధికారంలో పరిమితం చేసినప్పుడు మాత్రమే తిరిగి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది . కానీ దానికి భిన్నంగా ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి బారాస పార్టీ ప్రభుత్వం పైన అనేక అవినీతి ఆరోపణలు చోటు చేసుకోవడాన్ని పాలకపక్షం గ్రహించాలి. కాలేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బరాజుతోపాటు రాష్ట్రంలో నిర్మించిన అనేక ప్రాజెక్టుల పైన అవినీతి ఆరోపణలు ప్రధానమైనంగా చర్చ జరుగుతున్న నేపథ్యం.అధికారపార్టీ mla లపైభూకబ్జా,ఇతర ఆరోపణలు సరేసరి. ఇక నిర్మించిన డబుల్ బెడ్ రూములు, దేవాలయాలు, సచి వాలయము, కాలువలు, ఆసుపత్రులు కూడా నాణ్యత లేకుండా కొద్ది కాలంలోనే నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారనే అపవాదు ఇప్పటివరకు సమాధానం పొందలేకపోయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం విస్మరించిన అంశాలు, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారాలనే ప్రతిపాదన ఆలోచన ఆకాంక్షలు, ప్రజల్లో బలంగా రావడానికి గల కారణాలను అన్వేషించుకుని సమీక్షించుకోవలసిన అవసరం ప్రజలకు ప్రజాస్వామ్య వాదు లకు ముఖ్యంగా అధికార పార్టీకి ఉన్నది . ఇది సమీక్ష మాత్రమే కాదు ప్రజలకు జరిగిన ద్రోహాన్ని ఎండగట్టి నేరస్తులను శిక్షించి రేపు రాబోయే ప్రభుత్వానికి కూడా హెచ్చరికగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఇప్పటికీ సమాధానం లేని. కొన్ని ప్రశ్నలు :-
****
తరగతి గదిలో విద్యార్థుల ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడంతో పాటు అవసరమైతే తెలుసుకొని చెప్పడం ఆనవాయితీ అది ఒక సామాజిక బాధ్యత .ఆ బాధ్యతను విస్మరించిన ఏ ఉపాధ్యాయుడైన నిలవలేనట్లే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన పైన పదేళ్ల తీరు పైన ప్రజా సంఘాలు మేధావులు బుద్ధి జీవులు విపక్షాలు ప్రజల పక్షాన మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా జవాబు చెప్పకుండా అణచివేతకు గురి చేయడమనేది పాలకుల యొక్క నిరంకుశత్వం నియంతృత్వం అని చెప్పక తప్పదు.
_ రాష్ట్రంలో ముఖ్యంగా సింగరేణి గనుల విషయంలో ఓపెన్ కాస్ట్ గనుల కారణంగా రాష్ట్రం ఎడారిగా మారిపోతున్నదని అధికారంలోకి వస్తే వాటిని మూసి వేయిస్తామని హామీ ఇచ్చినప్పటికి యదేచ్చగా కొనసాగుతూ ఉంటే మౌనం వహించడం దేనికి? అంతేకాకుండా నిర్వహణను ఏఎంఆర్ కంపెనీకి అప్పగించడంతోపాటు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసినట్లు కాంగ్రెస్ పార్టీ విమర్శించడానికి సమాధానం చెప్పకపోతే నేరమే కదా!
- 2018 ఎన్నికల సందర్భంగా అఖిలపక్షాలతో కీలక అంశాల పైన చర్చిస్తానని మాట ఇచ్చి వాగ్దానం చేసి ఇప్పటివరకు ఏనాడు కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించకపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పగలదా ?
_ఉద్యమ కాలంలో ముఖ్యంగా ప్రకృతి గుట్టల విధ్వంసంపై ఘాటుగా విమర్శించి ప్రతిఘటించి అధికారంలోకి రాగానే పూర్తిగా ఆపివేస్తామని మాటయిచ్చి ప్రస్తుతం యదేచ్ఛగా కొనసాగడమే కాదు అధికార పార్టీకి చెందిన వాళ్లు కూడా భాగస్వాములు కావడంపై జవాబెది?
- దళితులకు మూడెకరాల భూమి, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని ఎవరడుగని హామీ ఇచ్చి దళిత బహుజనులకు ద్రోహం చేయడంపై పెదవి విప్పరెందుకు?
,-తెలంగాణ ఆకాంక్షలు నిర్వీర్యమై పాలన బ్రష్టు పట్టి పోతుంటే సహించలేనటువంటి మేధావులు బుద్ధి జీవులు అమరవీరుల ఆత్మీయ సమ్మేళనాలు, అమరవీరుల ఆకాంక్షల వేదిక , తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, బీసీ సంక్షేమ సంఘాలు వంటి అనేక ప్రజాసంస్థలు ఏర్పడి ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తుంటే మేధావులకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? విలువలు పునః ప్రతిష్టాపన జరగకపోతే రాష్ట్రంలో అశాంతి అబద్ర త నెలకొంటుందని స్వేచ్ఛ సమానత్వం కాపాడుకోవడానికి మేధావులు విద్యావంతులు యువకులు ముందు వరుసలో ఉండి పోరాడవలసిన సమయం ఆసన్నమైనదని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మేధావులను హెచ్చరించడాన్నీ బట్టి రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన కొనసాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల హనుమకొండలో జరిగినటువంటి "పదేళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కర్తవ్యాలు" అనే అంశం పైన జరిగిన సదస్సులో ఆయన చేసిన హెచ్చరికలు ప్రభుత్వానికి గుణపాఠం కావాల్సిన అవసరం ఉంది . ప్రభుత్వానికి ఆస్తులు ఉండవని, ఆస్తులన్నీ ప్రజలవేనని , ప్రభుత్వం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలని కానీ అందుకు భిన్నంగా ఆస్తులన్నీ ప్రభుత్వానివిగా భావించి ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారని నిజాం సమయంలో నిరంకుశ పాలన నిర్బంధానికి అనచి వేతకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ పోరాటం వచ్చినట్లే అరాచకాలు కొనసాగిన చోట ప్రతిఘటన తప్పదని చేసిన హెచ్చరిక ప్రభుత్వం మారాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరడానికి ప్రత్యామ్నాయ శక్తులు ఉద్యమించాలని పిలుపు ఇచ్చినట్లు కాదా ?ఇదే సందర్భంలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ జిల్లాలను ముక్కలు చేసి రాష్ట్ర అస్తిత్వాన్ని పాలకులు దెబ్బతీశారని తెలంగాణ పేరు చెప్పుకొని గెలిచిన పార్టీ తెలంగాణ ఉనికే లేకుండా చేసిందని అలాంటప్పుడు దేనికోసం కొట్లాడుతున్నారని ప్రశ్నించడం తెలంగాణ అస్తిత్వం కోల్పోయింది అనడానికి నిదర్శనం కాదా?
షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ,పెన్షన్లు , ఉచితాలు , రైతుబంధు, దళిత బంధు, బీసీ బందు పేరుతో ప్రజాధనాన్ని కొన్ని వర్గాలకు మాత్రమే పంచిపెట్టడం పరిపాలన కాదని ప్రజలందరికీ చెందే విధంగా ముఖ్యంగా పేదవర్గా ల యొక్క మానవాభివృద్ధిని సాధించే దిశగా కృషి జరగాల్సింది పోయి పెట్టుబడిదారులకు మాత్రమే వంత పడుతున్నటువంటి ప్రభుత్వం ప్రజలను విస్మరించినo దుకే ఈ ప్రతిఘటన. పేదరికం, నిరుద్యోగము, ఆకలి చావులు, ఆత్మహత్యలు స్పష్టంగా కనబడుతుంటే నిర్బంధము, అణచివేత, నిరంకుశత్వం రాజ్యమేలుతున్నదని వీటికి ప్రత్యామ్నాయంగా స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సౌబ్రాతృత్వం ,మానవాభివృద్ధి, ప్రజలే ప్రభువులుగా ఉన్నటువంటి వ్యవస్థ ఏర్పాటు కోసం ఉద్యమించాలానే భావన ప్రజల్లో వచ్చి నందుకు స్వాగతించవలసినదే. రాబోయే ప్రభుత్వాలు కూడా విద్య వైద్యాన్ని ఉచితంగా నాణ్యమైన స్థాయిలో అందించడంతోపాటు, మౌలిక సౌకర్యాలను కల్పించి, ప్రజలను ప్రభువులు గా నిలబెట్టాలి. గత పదేళ్లలో అది జరగనందుననే నేడు యుద్ధం అనివార్యమైనదని విశ్లేషకులు మేధావులు అభిప్రాయపడుతూ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వడం పరిశీలించదగిన విషయం.అయితే ప్రజలను విస్మరిస్తే ఏ పార్టీకైనా పతనం తప్పదు అనే ముచ్చట కొసమెరుపు.జాగ్రత్త!!!
-- వడ్డేపల్లి మల్లేశం
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయులు జననేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)