నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ.. చిరంజీవి

నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ.. చిరంజీవి

హైదరాబాద్‌:- ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఆయన కీలక పాత్రలో మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది.

  ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచుతుండగా, తాజాగా చిరంజీవి సంభాషణ ఆడియోను విడుదల చేసింది. రాజకీయాల గురించి చిరంజీవి చెప్పిన డైలాగ్‌ అలరిస్తోంది. దీన్ని చిరు ట్విటర్‌గా వేదికగా పంచుకోగానే నిమిషాల్లోనే వైరల్‌ అయింది. చిరు సినిమాలో డైలాగ్‌ చెప్పారా? లేదా సమకాలీన రాజకీయాలపై స్పందించారా? అంటూ సోషల్‌మీడియా వేదికగా చర్చ మొదలైంది. అయితే, చిరంజీవి నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్‌’ ఫొటోతోనే ఆడియో సంభాషణ ఉండటంతో ఇది సినిమాలోని డైలాగేనని అంటున్నారు. చిరు మాత్రం తన ట్వీట్‌కు ఎలాంటి కామెంట్‌ జోడించలేదు.

  సినిమా విడుదలకు ఇంకా 15 రోజులే ఉండటంతో నిర్మాణానంతర కార్యక్రమంలో బిజీగా ఉండటంతో చిత్ర బృందం ఇంకా ప్రమోషన్స్‌ మొదలు పెట్టలేదు. సల్మాన్‌తో కలిసి చేసిన సాంగ్‌ కూడా సాంకేతిక సమస్యల కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ క్రమంలో చిరు పొలిటికల్‌ డైలాగ్‌తో ప్రచారం మొదలు పెట్టడంతో ప్రస్తుతం సోషల్‌మీడియా దృష్టంతా చిరు ట్వీట్‌పైనే పడింది. దీంతో అటు అభిమానులకు, ఇటు సినిమా ప్రచారానికి ఒక్క ట్వీట్‌తో ట్రీట్‌ ఇచ్చేశారు చిరంజీవి. ఇక చిరు రాజకీయ జీవితానికి వస్తే, ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్లు కేంద్రమంత్రిగానూ చిరంజీవి సేవలందించారు.

  ‘ఖైదీ నంబర్‌ 150’లో రీఎంట్రీ ఇచ్చి సినిమాలపై దృష్టి సారించిన చిరు, ఆ తర్వాత ‘సైరా’, ‘ఆచార్య’ చేశారు. ఇప్పుడు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘గాడ్‌ఫాదర్‌’ ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతుండగా, ‘భోళా శంకర్‌’, ‘వాల్తేరు వీరయ్య(వర్కింగ్‌ టైటిల్‌), చిత్రాలు సెట్స్‌పైన ఉన్నాయి. దీంతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు చిరు పచ్చజెండా ఊపారు.

  ఇక ‘గాఢ్‌ఫాదర్‌’ విషయానికొస్తే మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో నటించిన మలయాళ సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌’ రీమేక్‌గా వస్తోంది. చిరంజీవి స్టార్‌డమ్‌కు సరిపోయేలా మోహన్‌రాజా కథలో చిన్న చిన్న మార్పులు చేశారు. అదనపు ఆకర్షణ తీసుకొచ్చేందుకు మలయాళంలో పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్‌తో చేయిస్తున్నారు. చిరంజీవి సోదరి పాత్రలో నయనతార కనిపించనున్నారు. ప్రతినాయకుడి పాత్రలో సత్యదేవ్‌ కనిపించనున్నారు.