చిన్న పత్రికల్లో ఉంది చిక్కదనం . నిగ్గు దేల్చే నిజాలు ప్రజా చైతన్యానికి ప్రతిరూపాలు.

సామాజిక స్ఫూర్తికి దర్పణాలు .
-- వడ్డేపల్లి మల్లేశం
"ప్రతి కొ క్కటున్న పదివేల సైన్యంబు పత్రికొ క్కటు న్న మిత్ర కోటి - పత్రిక లేకున్న ప్రజకు రక్ష లేదు నవయుగాల బాట నార్ల మాట " ప్రముఖ పత్రికారంగనిపునుడు కీర్తిశేషులు నార్ల వెంకటేశ్వరరావు మాటలివి. పత్రికా స్వేచ్ఛ భారతదేశం 180 దేశాలకు గాను 150 వ స్థానంలో అత్యంత వెనుకబడిన స్థానంలో ఉన్నప్పటికీ పత్రికలు మాత్రం ప్రజల కోసం సామాజిక బాధ్యతగా పనిచేస్తున్న పత్రికలు ఎన్నో. అందులో ముఖ్యంగా చిన్న పత్రికలు ముఖ్యంగా గత నాలుగైదు సంవత్సరాలుగా వస్తున్న డిజిటల్ పత్రికలతో పాటు గత దశాబ్దాల క్రితం ప్రారంభించబడిన మాన్యువల్ పత్రికలు కూడా సమాచారాన్ని సాహసోపేతంగా సమాజానికి అందించిన సందర్భాలను మనం గమనించవచ్చు. *పత్రికలు పెట్టుబడిదారుల విష పుత్రికలు* అనే మాట ప్రపంచ ప్రఖ్యాత ఉద్యమ నాయకులు మేధావి మార్చ్ వక్కాణించినప్పటికీ గుడ్డిలో మెల్లగా మేధావులు బుద్ధి జీవులు ఉద్యమ శక్తులు ప్రగతిశీల భావజాలం కలిగిన ప్రతి ఒక్కరి నుండి వెలువడుతున్న అభిప్రాయాలను సమాజానికి కార్య క్షేత్రానికి అందించడానికి చేస్తున్న ప్రయత్నం పోషిస్తున్న పాత్ర ఎనలేనిది అని చెప్పక తప్పదు . ఇప్పటికీ అనేక పత్రికలు తమ సామాజిక ధర్మాన్ని నిర్వహిస్తూ యాజమాన్యాల వారీగా అందులో పని చేస్తున్నటువంటి సిబ్బంది క్రింది స్థాయి జర్నలిస్టులు విలేకరులు నిబద్ధతగా పనిచేస్తున్న వాళ్లను కూడా మనం చూడవచ్చు .అందర్నీ ఒకే స్థాయిలో ఆలోచించడం సబబు కాదు కానీ పత్రికలు నిర్వహిస్తున్న పాత్ర ప్రజా చైతన్యం మెరుగైన సమాజ నిర్మాణానికి సోపానాలుగా భావించడంలో అతిశయోక్తి లేదు . అయితే పెద్ద పత్రికలు పెద్ద మొత్తంలో పెట్టుబడి తో విస్తృత స్థాయిలో యంత్రాంగాన్ని కలిగి ఉండి నిర్వహిస్తున్న క్రమంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు మరికొన్ని ఇతర పార్టీలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి అనే అపవాదు బలంగా వుంది. ఆ క్రమంలో ఈ వాదానికి భిన్నంగా ప్రజల పక్షాన మాత్రమే పని చేస్తూ , ఏ పార్టీకి అనుగుణంగా కాకుండా, చిన్న పెట్టుబడి తో , సామాజిక లక్ష్యంతో, లాభాపేక్ష లేకుండా నిర్వహించబడుతున్న పత్రికలను ముఖ్యంగా చిన్న పత్రికలను కూడా మనం గుర్తించి ఆదరించవలసిన అవసరం చాలా ఉన్నది.
లక్ష్య సాధనలో చిన్న పత్రికలు :-
గత నాలుగైదు సంవత్సరాలుగా గమనించినప్పుడు జర్నలిజం యొక్క లక్ష్యాలకు అనుగుణంగా నామ మాత్రం పెట్టుబడి తో అపరిమితమైనటువంటి సామాజిక ప్రయోజనాన్ని అందించడానికి ముందుకు వస్తున్న పత్రిక రంగ యాజమాన్యాలను మనం గమనించవచ్చు . ముఖ్యంగా సాంకేతిక అనుభవంతో పాటు సామాజిక రంగాలలో స్పృహ ఉన్నటువంటి యువత ఈ రంగంలో కొనసాగడాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తే అదే క్రమంలో ఆయా పత్రికల్లో పని చేయడానికి కింది స్థాయి నుండి నిబద్ధత సేవా దృక్పథం అంకితభావం కలిగినటువంటి పత్రికా ప్రతినిధులను పరిశీలించినప్పుడు సామాజిక స్పృహవైపుగా చిన్న పత్రికలు పనిచేస్తున్నట్లు గమనించవచ్చు . పెద్ద మొత్తంలో పేజీలను కేటాయించడంతోపాటు , వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపే ప్రయత్నం , నిర్మోహమాటంగా వ్యవస్థ గూర్చి రాయడం, ప్రజల పక్షాన పని చేయడం ముఖ్యంగా చిన్నపత్రికల్లో గమనించ తగిన లక్షణాలు. వార్త , వ్యాసమైన, కథనాలు అయినా పేజీలను ఎక్కువ కేటాయించిన కారణంగా విస్తృతంగా వివరణత్మకంగా ప్రచురి0 చడానికి వీలవుతున్నది. దాని ద్వారా రచయితలు ప్రెస్ నోట్ లు ఇచ్చినటువంటి వివిధ రంగాల ప్రతినిధులు కూడా సంతృప్తి చెందడానికి వీలున్నది. ఒకనాడు పెద్ద పత్రికల్లో వార్త కానీ వ్యాసం కాని వస్తే సంతోషపడే విధానం నుండి ప్రస్తుతం పాఠకుల దృష్టిలో కూడా మార్పు వచ్చింది . ఇక పెద్ద పత్రికల నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్న కారణంగా క్రింది స్థాయిలో పనిచేసే జర్నలిస్టులకు పెను భారం అవుతున్న సందర్భంలో చాలామంది కూడా ఆ పత్రికల నుండి తప్పుకొని చిన్న పత్రి కల్లో పనిచేయడానికి రావడాన్నీ గమనించవచ్చు . ఇక పెద్ద పత్రికల్లో మెజారిటీ పత్రికలు ఏదో ఒక వర్గానికి అనుకూలంగా రాస్తున్నాయి అనే విమర్శ కారణంగా వాటి మీద విశ్వసనీయత కూడా క్రమంగా తగ్గుతున్నది . కానీ చిన్న పత్రికలు ఏ వర్గ ప్రయోజనం కోసం పని చేయకుండా కేవలం ప్రజా దృక్పథంతో పనిచేయడానికి మొ గ్గు చూపుతున్న కారణంగా ఎవరి మీద ఆధారపడడం, ప్రభుత్వ ప్రైవేటు ప్రకటనలకు ఎదురు చూడడం అవసరం లేని కారణంగా కూడా సవాలుగా తీసుకొని ప్రజల పక్షాన జవాబు చెప్పే స్థాయిలో పత్రికలు వెలబడడాన్ని పరిశీలించినట్లయితే చైతన్యానికి ప్రత్యేకంగా సామాజిక విషయా లకు ప్రతిరూపంగా చిన్న పత్రికలు పనిచేస్తున్నాయని భావించడంలో పొరపాటు లేదు. క్రింది స్థాయి విలేకరులు కూడా ఒత్తిడి లేని కారణంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా తమ దృష్టికి వచ్చినటువంటి అంశాలను మొహమాటం లేకుండా రాయడానికి వీలవుతున్నది. అంతెందుకు ఇటీవల కాలంలో వ్యాసాలను సైతం పెద్ద మొత్తంలో ప్రచురించడాన్నీ చిన్న పత్రికలలో మనం గమనించవచ్చు .పత్రిక యొక్క స్వరూపం వార్తలతో పాటు వ్యాసాలు కథనాలు లేఖలు వంటి అంశాల ద్వారా కూడా ప్రజల మీద పెను ప్రభావాన్ని చూపుతుంది. పత్రికా రంగ లక్ష్యాలను సాధించే క్రమంలో చిన్న పత్రికలు పోషిస్తున్న పాత్రను అనేకమంది ఇటీవలి కాలంలో ప్రశంసించిన విషయాలను గమనించినప్పుడు కాలానుగుణంగా మారుతున్న సామాజిక ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా వార్తలు వ్యాసాలు, కథనాలను ప్రజలకు అందించడంలో విప్లవాత్మక మార్పులకు చిన్న పత్రికలను వేదికలుగా భావించవచ్చు . పెద్ద పత్రికలను విమర్శించడం తప్పు పట్టడం కాదు కానీ భిన్న పరిస్థితుల నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాన్ని ఆశించే పరిస్థితుల నేపథ్యంలో చిన్న పత్రికల యొక్క ప్రాధాన్యతను, పని విధానాన్ని, ప్రచురిస్తున్న అంశాలను , ప్రజా ప్రయోజనాలను ప్రస్తావించక తప్పడం లేదు. చిన్నపత్రికల నిర్వాహకులు కూడా క్రింది స్థాయి జర్నలిస్టులను ప్రోత్సహించే విధంగా నిర్బంధం అణచివేత లేకుండా స్వేచ్ఛగా రాయడానికి సహకరించినట్లయితే రాబోయే కాలంలో చిన్న పత్రికల ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు . సామాజిక మార్పుకు, ప్రజా చైతన్యానికి , వివిధ రంగాల విశ్లేషణకు , సామాజిక అవగాహనకు , మెరుగైన వ్యవస్థకు గుణాత్మక మార్పులను తీసుకొచ్చే క్రమంలో పత్రికలు పోషిస్తున్న పాత్రను ప్రస్తావించుకున్న ప్రతి సందర్భంలోనూ చిన్న పత్రికలు ముందు ఉంటాయని భావించడం అత్యాశ కాదు.సెల్ వ్యవస్థ బలపడిన తరుణంలో అరచేతిలో విశ్వజ్ఞానానికి ప్రతీకగా చిన్న డిజిటల్ పత్రికలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చిన్నపత్రికల ముమ్మర ప్రతిపాదనను అటు యాజమాన్యాలు ఇటు విలేకరులు ప్రయోజనం పొందుతున్నటువంటి ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఆదరించినప్పుడు చిన్న పత్రికలని చిన్న బు చ్చుకోవాల్సిన అవసరం లేదు సరి కదా! వాటి ప్రయోజనం అపారమని గుర్తిస్తే మంచిది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లీ) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)