కాంగ్రెస్ వస్తే  రాష్ట్రం ఆగమైతది అంటున్న బారాస

కాంగ్రెస్ వస్తే  రాష్ట్రం ఆగమైతది అంటున్న బారాస

 గత తప్పిదాలను  ఎత్తి చూపి లబ్ధి కోరుతున్న అధికారపార్టీ.

ప్రజలేమో మార్పు కోరుకుంటున్నట్లు  బలమైన వార్తలు.

దోపిడీ పాలన అంతమై  తెలంగాణ రక్షించుకోవాలంటున్న  మేధావి సంఘాలు.

నమ్ముకున్న పార్టీ ప్రజల విశ్వాసాన్ని నిలబెడుతుందా? సోయి తెచ్చుకుంటే జనం హర్షిస్తరు. .

1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నుండి  2014లో  తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు  ఉమ్మడి రాష్ట్రాన్ని  కాంగ్రెస్ పార్టీ సుమారు 35 సంవత్సరాలు పరిపాలన చేసింది  మిగతా కాలంలో తెలుగుదేశం పార్టీతో పాటు  కొంతకాలం రాష్ట్రపతి పాలన  జరిగిన విషయం అందరికీ తెలిసినదే.  2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ,2018లోనూ  కెసిఆర్ గారి నాయకత్వంలోనే  తెరాస   పార్టీ అధికారంలోకి వచ్చింది.  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో2023  నవంబర్ 30వ తేదీన జరగనున్న  అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా  కెసిఆర్ ప్రతి ప్రచార సభలో  కాంగ్రెస్ మళ్లీ వస్తే ఆగమైపోతుందని  ,దశాబ్దాల పాటు కాంగ్రెస్ పరిపాలించిన నాడు  రాష్ట్రానికి ఏమీ చేయలేదని,  ప్రాజెక్టుల నిర్మాణం అభివృద్ధి ఇతర సౌకర్యాలు  నిర్లక్ష్యం చేసిందని ఘాటుగా విమర్శించడం జరుగుతున్నది.  అంతేకాదు ఇటీవల మారిన పరిణామాల నేపథ్యంలో  రాష్ట్రంలో 10 సంవత్సరాల పాలన తర్వాత  ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో  కెసిఆర్ నినాదం  కాంగ్రెసు, ఇతర పార్టీల, ప్రజలను ఆలోచింప చేసే విధంగా  అంతే కాదు బారాస లబ్ధి పొందే విధంగా కనబడుతున్నది . ఒకవేళ పొరపాటున  రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  రాష్ట్రం ఆగమైపోతుందని  కష్టాలు కన్నీళ్లు కరెంటు కోత కడగండ్లు మాత్రమే మిగిలిపోతాయని  ఘాటైన విమర్శలు చేయడం ద్వారా  బారాస లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నది.  ప్రజల దృష్టిని మళ్లించి  అనూహ్య రీతిలో ఒకవేళ గెలిచే అవకాశం ఉంటే  ఆ అవకాశాన్ని దెబ్బ కొట్టే విధంగా చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని  కాంగ్రెస్ పార్టీ  దీటుగా ఎదుర్కొంటున్నప్పటికీ  సంస్థాగతంగా గతంలో జరిగిన కొన్ని లోపాలు పొరపాట్లు  ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసాన్ని  కోల్పోయేలా చేస్తున్నవి.

బారాస వ్యూహం ఏమిటి  :-

గత పది సంవత్సరాలుగా బారాస ప్రభుత్వము ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పనిచేస్తుందని , విద్యా వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు  ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసి  యువతకు తీరని ద్రోహం తలపెట్టినట్లుగా మేధావులు బుద్ధి జీవులు ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున దుమ్మెత్తి పో స్తున్నారు . తెలంగాణ ఉద్యమకారుల వేదిక పేరుతో  ఏర్పాటైనటువంటి సంస్థ  బారాస ప్రభుత్వ వైఫల్యాలను కరపత్రాల రూపంలో ప్రజల్లోకి తీసుకుపోతున్న సందర్భం  రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని  ప్రజలు కోరుకుంటున్న నేపద్యంలో  చిలికి చిలికి గాలి వానలా తయారవుతున్న ప్రమాద   పరిస్థితులను అంచనా వేసిన బారాస ప్రభుత్వం  కాంగ్రెస్ పార్టీ పైన  విమర్శనాస్త్రాలను సంధించే క్రమంలో  చేస్తున్న   ఆరోపణల్లో కొంత వాస్తవం ఉన్నప్పటికీ  తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి చేస్తున్న కుట్రగా  ప్రజాస్వామ్యవాదులు  కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది.  భారతీయ జనతా పార్టీ,  బహుజన్ సమాజ్ పార్టీ ,ధర్మ సమాజ పార్టీ,  ఇతర కొన్ని పార్టీలు,  స్వతంత్ర శక్తులు  బారాస తిరిగి అధికారానికి రాకూడదని  తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుకోవడాన్నీ కూడా మనం గమనించవచ్చు.  .తెలంగాణ ఎన్నికల యుద్ధo లో  ఎవరి శక్తియుక్తులను వారు  ప్రదర్శించడం,  మేనిఫెస్టో లను  ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ద్వారా  ప్రచారం చేసుకుంటున్నప్పటికీ  అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజల కంటే డబ్బుని మిన్నగా నమ్ముకోవడం  ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తున్న విషయం . బారాస పార్టీ గత పదేల్లు గా  అవినీతి,  భూకబ్జాలు, అక్రమ దందాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించి  తిరిగి ఎన్నికల్లో అధికారానికి రావడానికి పెద్ద ఎత్తున ప్రజలకు పంచడానికి సిద్ధంగా ఉన్నదని కాంగ్రెస్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తుంటే  బా రాస మాత్రం  ఒక్కొక్క పార్టీని  భిన్న పద్ధతిలో విమర్శిస్తూ తాను మాత్రమే  ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి  సమర్థత కలిగి ఉన్నట్లు ప్రచారం చేసుకోవడం కూడా నియంతృత్వ ధోరణికి అద్దం పడుతుంది .
       కాంగ్రెస్ హయాంలో  కరెంటు సరిగా ఇవ్వలేదని,  24 గంటలు ఇచ్చే రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని,  కాంగ్రెస్ వస్తే కష్టాలు కన్నీళ్లు కడగండ్లు కరువు కాటకాలు మిగిలిపోతాయని,  ఏవో ఏవో పార్టీలు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తూ ఉంటాయని కానీ ఎవరిని నమ్మకూడదని  మిగతా రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని బారాస  చేస్తున్న ప్రచారం  ఏకపక్షంగా కనిపిస్తున్నది . ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా,  రాష్ట్రంలో ప్రజాస్వామ్యం  నిర్వీర్యమైనదని,  ప్రకృతి గు ట్టల విధ్వంసం యదేచ్ఛగా కొనసాగుతున్నదని,  విద్య వైద్యం పూర్తిగా ప్రైవేటు పరం అయింది అని  ప్రజా సంఘాలు  ఘాటుగా విమర్శిస్తున్నాయి .కాంగ్రెస్ పార్టీ మాత్రం బారాస ప్రజలకు ద్రోహం చేసిందని , కుటుంబ పాలన  నియంతృత్వ  అవినీతి పద్ధతిలో రాజ్యమేలుతున్నదని  గళం ఎత్తడం  ప్రతిపక్షాల బలాన్ని మరింత పెంచుతున్నది .కానీ  కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా టార్గెట్ చేసి బారాస ప్రభుత్వం   పైకి డాంబికంగా మాట్లాడుతూ  ప్రజలు ఓడిస్తే విశ్రాంతి తీసుకుంటామని కానీ నష్టపోయేది ప్రజలే అనే కొత్త నినాదాన్ని ఎత్తుకోవడం  కాంగ్రెస్ పట్ల ప్రజలను ఆలోచింపజేస్తున్నది.  ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పైన బారాస చేసిన ఆరోపణలు  సందర్భోచితంగా అంగీకరిస్తూనే  భవిష్యత్తులో అలాంటి పొరపాటు జరగకుండా చూస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన హామీ ఇచ్చినప్పుడు మాత్రమే ప్రజలు మరింత విశ్వసిస్తారు.  ప్రతి పనికి ఢిల్లీ వెళ్లాలని,  ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మారుతారని , స్థిరమైన ప్రభుత్వము ఉండదని,  కరెంటు కష్టాలు తప్పవని , అందరూ ముఖ్యమంత్రి రేసులో ఉంటారని,  నిర్ణయం ఢిల్లీలోనే జరుగుతుందని,  రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లేని ఈ ప్రభుత్వం అవసరమా ?అని అనేక రకాలుగా కేసీఆర్ విమర్శిస్తున్నారు . అయితే బారాస ప్రభుత్వం పైన ప్రజలకు  మిశ్రమ స్పందన ఉన్నది  ప్రభుత్వ పథకాలన్నీ పార్టీ వర్గాలకే అందించినట్లు,  ప్రజలను నిర్లక్ష్యం చేసినట్లు,  యువతకు ఉద్యోగాలు ఉపాధి లేకుండా  నియంతృత్వ పోకడతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లు  విద్యార్థులు ప్రజాస్థానిక వాదులు ప్రజా సంఘాలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో  రాష్ట్రంలో  ప్రత్యామ్నాయ శక్తుల కోసం వేట ప్రారంభమైనట్లుగా భావించవలసి ఉంటుంది  .ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ  నూతన ఉత్తేజంతో ప్రయత్నించడం,  ప్రజలు కోరుకున్న సందర్భంలో ప్రత్యామ్నాయ శక్తిగా కనిపించడం , కొన్ని వామపక్ష ప్రజాసంఘాలు  కాంగ్రెస్కు నిష్కర్షగా  మద్దతిస్తున్న కారణంగా  ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే  ప్రజలను వంచించకుండా  బారాస విమర్శలకు  దీటుగా తి ప్పి కొట్టే స్థాయిలో  పరిపాలన చేయకుంటే  రాష్ట్రం నిజంగానే ఆగం అయిపోతుంది... కానీ  ఇప్పుడు కూడా ఆగమై ఉన్న విషయాన్ని మనం గమనించకపోతే అంధకారమే..
        ప్రజాస్వామ్య విలువలకు  ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా  స్థానికంగా అధికారాన్ని కేంద్రీకరింపజేసి  ప్రజా ఆకాంక్షల కనుగుణంగా  స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్  కఠిన నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే  బారాసా విమర్శలను తిట్టుకొట్టవచ్చు . ప్రజల విశ్వాసాన్ని  పరిరక్షించే అవకాశం ఉంటుంది  .నిజంగా కూడా దీర్ఘకాలం ఒక పార్టీ ప్రభుత్వం కొనసాగడం  నిరంకుశత్వానికి దారితీస్తుంది ఆ రకమైన చాయలను ఇప్పుడు తెలంగాణలో చూడవచ్చు.    ప్రజా ఆకాంక్షలు  మరుగున పడుతున్న సందర్భంలో  ఉద్యమకారుల  కలలను నిజం చేయాలన్నా,  అమరవీరుల ఆశయాలు నెరవేర్చాలన్న,  ప్రస్తుత ప్రభుత్వానికి భిన్నమైన ప్రభుత్వం రావాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉన్నది . ఈ సందర్భాన్ని హుందాగా స్వీకరించి  బాధ్యతాయుతంగా వ్యవహరించి  ప్రజల ముందు తలవంచుకునేలా కాకుండా  తల ఎత్తుకునేలా  ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడితే  బారాస విమర్శలకు  అర్థం లేదని కేవలం అధికారం కోసం చేసిన  ప్రచారంగా భావించవచ్చు.  ప్రజల పక్షాన ఆకాంక్షల నేపథ్యంలో  సందర్భోచితంగా  సోయి  తెచ్చుకుంటే  కొత్త ప్రభుత్వం నిలబడుతుంది గెలుస్తుంది . బుద్ధి జీవులు మేధావుల ఆకాంక్షలు నిజమై  నియంతృత్వానికి చెంపపెట్టుగా  పరిణమిస్తుంది . ఆ వైపుగా  అవకాశం ఉన్న అన్ని శక్తులు కూడా  ఉమ్మడి ఉద్యమ స్ఫూర్తిని  ప్రదర్శించి  కొత్త వెలుగుల కోసం  కృషి చేయవలసిన బాధ్యత  రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు  అందరి మీద ఉన్నది . ముఖ్యంగా అధికారానికి రావాలని ఆశపడుతున్న కాంగ్రెస్ పార్టీ  తన్ను తాను  ప్రక్షాళన చేసుకుని సంస్కరించుకుంటేనే  పబ్లిక్ లో నిలబడే అవకాశం ఉంటుంది.! జాగ్రత్త.!

--వడ్డేపల్లి మల్లేశం 
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి )జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)