కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు బీసీలకు ద్రోహం చేసిన పార్టీలే
ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఎంత అవసరమో బహుజనులకు రాజ్యాధికారం కూడా అంతే ముఖ్యం.
పార్టీలు ఏవైనా బీసీలను అనగ తొక్కితే నాయకత్వాన్ని ఉక్కు పాదంతో అణచివేయాలి.
అంటే ఆ పార్టీల నాయకత్వాన్ని తొలగించడమా? బహిష్కరించడమా? జరగాలి.
ప్రపంచానికి భిన్నంగా కుల వ్యవస్థ బలంగా ఉన్న భారతదేశంలో ఆయా కులాల వారీగా జనాభాను లెక్కించి ఆ వర్గాలకు ప్రయోజనం చేకూర్చడం ప్రభుత్వాల యొక్క బాధ్యత . అసమానతలు అంతరాలు దోపిడీ వ్యవస్థ బలంగా ఉన్న ఈ దేశంలో అంబేద్కర్ ఆశించిన స్థాయిలో కుల నిర్మూలన జరగాలని కోరుకోవడం తప్పులేదు కానీ ఆర్థిక వ్యవస్థకు కులాలకు సంబంధం ఉన్న కారణంగా అంత సులభంగా కుల నిర్మూలన సాధ్యం కావడం లేదు. దీనిని మేధావులు గుర్తించిన తర్వాత వర్గ సంఘర్షణను ప్రస్తావించే మార్క్సిజం, కుల నిర్మూలన వైపుగా ఆలోచించే అంబేద్కరిజం కలిసి పనిచేసిన నాడు మెరుగైన వ్యవస్థను ఆశించవచ్చునని జరిగిన నిర్ణయం తాత్కాలికమే అయినా ఆ వైపుగా కదలికలు ఇంకా ప్రారంభం కాలేదు. అదే సందర్భంలో రాజ్యాంగ రచన కాలంలో అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిన తర్వాత బీసీ వర్గాల రిజర్వేషన్ సమయంలో ఆనాడు మెజారిటీగా ఉన్నటువంటి అగ్రవర్ణాల నాయకత్వం వ్యతిరేకించిన కారణంగా బీసీ రిజర్వేషన్ కుప్పకూలినట్లు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండానే రాష్ట్రపతి నిర్ణయానికి వదిలి వేసే ఒక ప్రకరణ మాత్రం రాజ్యాంగంలో చోటు చేసుకోవడం జరిగింది. గత 75 సంవత్సరాల కు పైగా సుమారు 60 శాతం గా ఉన్న బీసీ వర్గాలకు ఆయా రాజకీయ పార్టీలు టికెట్ కేటాయించకపోవడం, రిజర్వేషన్ సౌకర్యం లేకపోవడం, పార్టీల నాయకత్వాలు అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న కారణంగా బీసీలు నష్టపోయినారు అనే విషయం ఇటు బీసీ సమాజానికి అటు నాయకత్వంలో ఉన్న అగ్రవర్ణాలకు తెలుసు. కానీ పార్టీల నాయకత్వం ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్న కారణంగా ఈ సమస్య ఇంకా నానుతూనే ఉన్నది. ఇటీవలి కాలంలో బీసీ కులగనన జరిపి జనాభా ఆధారంగా ఆ వర్గ ప్రయోజనం కోసం వివిధ పథకాలను అమలు చేయాలని, చట్టసభలలో 50 శాతం సీట్లను బీసీ వర్గాల కేటాయించే చట్టాన్ని రూపొందించాలని , సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్లు గత కొంతకాలంగా ఊపo దుకున్నప్పటికీ గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాలు కూడా ఆ వైపు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బీసీ వర్గాల పట్ల సవతి తల్లి ప్రేమకు నిదర్శనం కాదా?
తెలంగాణ ఎన్నికల్లో బీసీ వర్గాలకు టికెట్ల కేటాయింపు లో రాజకీయ పార్టీల కుట్ర :-
*******"
ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలించనప్పుడు, మౌలికమైన సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపకుండా, పెట్టుబడిదారీ విధానానికి వంత పాడుతూ అధికారం శాశ్వతం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ప్రజలు కచ్చితంగా నిలదీస్తారు, ప్రశ్నిస్తారు, ఓడిస్తారు కూడా. బహుశా అలాంటి వాతావరణమే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్నది . అయితే టికెట్ల కేటాయింపు విషయంలో మాత్రం కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు కూడా బీసీ వర్గాలను మోసగించిన విషయాన్ని ప్రస్తావించకుండా ఉండలేము. అదే సందర్భంలో బారా సా పార్టీకి ప్రత్యామ్నాయంగా మరో ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నా, పార్టీలు తమకు కేటాయించిన బీసీల టికెట్ల కేటాయింపును కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది . 60 శాతం ఉన్న బీసీ వర్గాలను నిర్లక్ష్యం చేసి ద్రోహం చేస్తే తగిన బుద్ధి చెప్పవలసి వస్తుంది. అదే సందర్భంలో ఎన్నికల సమయంలో కూడా తమ డిమాండ్ ను రాజకీయ పార్టీల ముందు పెట్టి పార్టీల ద్రోహబుద్ధిని నిలదీసి ఓటును నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన ఉన్నది. ముఖ్యంగా బీసీ వర్గాలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోయి, జెండాలు మోయడానికి , ప్లెక్షీలు కట్టడానికి, నినాదాలు ఇవ్వడానికి , సేవకులుగా పార్టీలో పనిచేయడానికి మాత్రమే పరిమితమైతే బీసీ వర్గాలు సహించకూడదు. ఆ రోషం, పౌరుషం , ఆత్మగౌరవం ఇప్పటికైనా ప్రదర్శించవలసిన అవసరం ఉన్నది.
అదే సందర్భంలో బీఎస్పీ, డిఎస్పి తో పాటు కొన్ని స్వతంత్ర అభ్యర్థులు కూడా రాజకీయ పార్టీల యొక్క ఆధిపత్యానికి విసుగు చెంది ఆత్మగౌరవంతో ఎన్నికల సమరంలో పోరాడుతున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ప్రస్తుతము ప్రజాస్వామి క ఉద్యమ శక్తులకు రెండు అంశాలు కీలకమైనవిగా మిగిలిపోయిన సందర్భంలో 1 ప్రత్యామ్నాయ శక్తిని గెలిపించుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం 2 బీసీ వర్గాలకు ద్రోహం చేసిన రాజకీయ పార్టీలను తరిమికొట్టడం అనేవి కీలకంగా మిగిలిపోయినవి. ఒక్కసారి పరిశీలిస్తే బారాస పార్టీ బీసీలకు 24 సీట్లు కేటాయిస్తే కాంగ్రెస్ 23 మందికి మాత్రమే బీసీ వర్గాలకు టికెట్లను కేటాయించి తమ తమ ద్రోహబుద్ధిని ప్రకటించుకోవడం జరిగింది. Bjp 30కి పైగాయివ్వడం గుడ్డిలో మెల్ల. 0.5% ఉన్నటువంటి వెలమలకు బారాస 10 మందికి టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ 9 మందికి కేటాయించడం తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడంతోపాటు బీసీల పట్ల వివక్షతను చూపడమే . ఇక కేవలం 5 శాతానికి లోపునే ఉన్నటువంటి రెడ్డి వర్గాలకు కాంగ్రెస్ పార్టీ 43 మందికి టికెట్లు ఇస్తే బారాస పార్టీ 42 మందికి కేటాయించి రెడ్డి ఆదిపత్యానికి గుర్తుగా సంకేతం గా మిగిలిపోవడాన్ని ఎలా చూడాలి? జనాభా దామాషాలో అధికారాలు ,బాధ్యతలు, ప్రాతినిధ్యాలు, అర్హతలు ఉండవలసిన స్థితిలో దానికి భిన్నంగా అల్పసంఖ్యాకులకే అధికారాన్ని కట్టబెట్టే ప్రయత్నం ద్రోహబుద్ధిని ఖండించవలసిన అవసరం మాత్రం తప్పకుండా ఉన్నది. బీసీ వర్గాలు ఇలాంటి వివక్షతను ఎండగట్టి ఉక్కు పాదం మోపవలసిన అవసరం ఎంతో ఉన్నదని అనాదిగా బీసీ సంక్షేమ సంఘాలు విస్తృతంగా ప్రచారం చేస్తూ చైతన్యం చేస్తున్నప్పటికీ వాస్తవాలను గుర్తించకపోవడం , అన్ని రాజకీయ పార్టీలలో అనుచరులుగానే మిగిలిపోవడం , రాజకీయ పార్టీల నాయకత్వం బీసీ వర్గాల చేతిలో లేకపోవడం వంటి కారణాల వలన కేవలం ఓటర్లు గానే మిగిలిపోవడం ఇప్పటికైనా సోయి తెచ్చుకోకపోతే పాలకులు ఎప్పటికీ ఆధిపత్య కులాలకు చెందిన వాళ్లే ఉంటారు, బహుజనులకు రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు . ఈ విషయాన్ని బీఎస్పీ అధినేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ , డీఎస్పీ అధినేత విశారదన్ రెడ్డి, రావు లు, బ్రాహ్మణ వర్గాల చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని బలవంతంగా గుంజుకోవాలని ఆ సోయి చైతన్యం బీసీలు ఇతర సామాజిక వర్గాలు తెచ్చుకోవాలని నిరంతరం ప్రసంగాలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం శూన్యం . టిఆర్ఎస్ ఓసీలకు 60 టిక్కెట్లు కేటాయిస్తే కాంగ్రెస్ 50 సీట్లు కేటాయించడం పోటా పోటీగా జరిగింది తప్ప బీసీ వర్గాలను పట్టించుకోని ఈ రాజకీయ పార్టీలను బంగాళాఖాతంలో విసిరి వేసిన తప్పులేదు కదా! కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి రెండు చొప్పున 17 నియోజకవర్గాలకు గాను 34 సీట్లు కేటాయిస్తామని పిసిసి చీఫ్ ప్రకటించినప్పటికీ మాట తప్పి 23 మందికి కేటాయించడాన్ని బహుజన సమాజం ఎందుకు అంగీకరించాలి?
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బహుజనుల వాటా ఏమిటో ముందే తేల్చాలని డిమాండ్ చేసినప్పటికీ ఆనాటి నాయకత్వం మేధావులు బుద్ధి జీవులు తెలంగాణ ఏర్పడిన తర్వాత మనలో మనం ఆ విషయాన్ని పరిష్కరించుకోవచ్చు అని మాట ఇచ్చి దాటవేసినారు . స్వరాష్ట్రంలో కూడా ఇప్పటికీ దళితులు, ఆదివాసీలు, బహుజన వర్గాల వాటా తేల లేదు కదా ! అధికారానికి దూరంగా ఉంచిన విషయాన్ని కచ్చితంగా నిలదీయాలి, అదే మాదిరిగా ప్రస్తుతం జరగబోయే ఎన్నికల సమరంలో బారా సా పార్టీకి ప్రత్యామ్నాయంగా నాయకత్వాన్ని ఆశిస్తున్న పార్టీలు కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన లోపాన్ని విప్పి చెప్పాలి, వైఫల్యాన్ని అంగీకరించాలి, ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రకటించి బహుజనులకు ముఖ్యంగా బీసీ వర్గాలకు క్షమాపణ చెప్పినప్పుడు మాత్రమే బీసీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది . అదే సందర్భంలో బహుజనులు బిసి వర్గాల కోసమే పనిచేసినమని చెప్పుకుంటున్న బారాస పార్టీ కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శించి అల్ప సంఖ్యాకులకు ఎ క్కువ సీట్లను కట్టబెట్టడంపై బహిరంగంగా తప్పును అంగీకరించకపోతే ప్రత్యామ్నాయ విధానాన్ని బీసీ సంక్షేమ సంఘాలు మేధావులు బీసీ వర్గాలు బహుజన సమాజము ఆలోచించవలసినటువంటి అవసరం మాత్రం తప్పకుండా ఉన్నది. నిరంతరం సేవకులుగా మిగిలిపోవడానికి బీసీ వర్గాలు సిద్ధంగా ఉన్నంతకాలం వెట్టి చాకిరి చేయించుకుంటూనే ఉంటారు . నిలదీసి , నిగ్గదీసి, ప్రశ్నించినప్పుడు నాయకత్వం తోక ముడుచుకొని పారిపోతుంది ఆ చైతన్యం ఇంకా ఎందుకు రావడం లేదు ? కాంగ్రెస్ పార్టీలోని బీసీ వర్గాలు 48 సీట్ల డిమాండ్ చేస్తే 23 టికెట్లు మాత్రమే కేటాయించడం ఆ తర్వాత బీసీ నాయకత్వం మౌనంగా ఉండడం దేనికి సంకేతం ? దీనిని బీసీ వర్గాలు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. బారాస, కాంగ్రెస్ రెండూ బీసీ వర్గాలకు ద్రోహం చేసిన పార్టీలే . అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన ఓటు వేయడానికి నిర్ణయించు కుంటారో ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం ఉన్నది. అయితే " అరాచకత్వం, నిరంకుశత్వం, నియంతృత్వం నశించినప్పుడు మాత్రమే మనలో మనం సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది" అనే ఏకైక మినహాయింపు దృష్టిలో వుంచు కోవాల్సి ఉంటుంది.
---వడ్డేపల్లి మల్లేశం
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సేన ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )