ఇక ప్రతి నెలా తెలంగాణకు అమిత్‌ షా!...

తెలంగాణలో నెలనెలా 2 రోజులు పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి

అసెంబ్లీ ఎన్నికల దాకా ఇదే షెడ్యూల్‌ ఉంటుందని పార్టీ నేతలకు సమాచారం

ఈ నెలాఖరులోగా మరోసారి రాష్ట్రంలో పర్యటించే అవకాశం. ఇకపై పార్టీ కార్యకలాపాలు, వ్యూహాలు పూర్తిగా షా కనుసన్నల్లోనే..

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా త్వరలోనే రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే దాకా ప్రతి నెలా రెండు రోజులు రాష్ట్రానికి కేటాయిస్తూ షెడ్యూల్‌ వేసుకున్నానని ముఖ్య నేతలకు అమిత్‌ షా వెల్లడించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా షా మరోసారి తెలంగాణకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో ఏడాదిన్నరలోగా రాష్ట్రంలో ఎన్నికలుంటాయనే అంచనాల నేపథ్యంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్‌ షాలతో కూడిన అగ్రనాయకత్వం పూర్తిగా రాష్ట్ర రాజకీయాలపై దృష్టిసారించడం తెలిసిందే.

ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఈ నెల 2, 3 తేదీల్లో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీలోనూ ‘మిషన్‌ తెలంగాణ’ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. అధికార టీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలు, కుటుంబపాలన, పాలనా వైఫల్యాలు, ప్రధాన హామీల అమల్లో వైఫల్యం వంటి అంశాలను ఎండగడుతూ అన్నిస్థాయిల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నిరంతరం ప్రజల్లోనే ఉండాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసింది. దాన్ని మరింత పటిష్టంగా క్షేత్రస్థాయిలో అమలు చేసే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, వ్యూహాలన్నీ పూర్తిగా జాతీయ నాయకత్వం, అమిత్‌ షా కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్‌ షా రాష్ట్ర పర్యటనలకు ప్రాధాన్యత ఏర్పడింది.

వరంగల్‌ సభకు అమిత్