అధికార పార్టీని తెలంగాణ ప్రజలు ఎన్నికల ప్రచారంలో  ఏ అంశాలపై నిలదీయాలి.

అధికార పార్టీని తెలంగాణ ప్రజలు ఎన్నికల ప్రచారంలో  ఏ అంశాలపై నిలదీయాలి.

పదేళ్లుగా పాలించిన బీఆర్ఎస్  ప్రజల కోసం అన్నీ చేసిన మంటున్నది కనుకే ప్రజలకు ఈ హక్కు.  మాట మార్చి ప్రజలను ఆగం చేయడం మానీ  సూటిగా  సమాధానం ఇవ్వాలి .* గారడి మాటలతో  ఆగమైతే  ప్రజలు మళ్ళీ చిక్కుల్లో పడ్డట్టే.* 
*
--వడ్డేపల్లి మల్లేశం  


   అంతిమంగా ప్రజలే  నిర్నేతలు కనుక   ప్రజల మాటకు రాజకీయ పార్టీలు పాలకులు కట్టుబడి ఉండాలి నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం . సమాధానం చెప్పకుంటే తరిమికొట్టాలి.
     2014 జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దాకా తెలంగాణ భూభాగము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే.  2014 నుండి గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా  బారాస పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భంలో  ఇక ఏ రాజకీయ పార్టీ కూడా అధికారానికి రాలేదు అనే విషయం నగ్నసత్యమే కదా!  అలాంటప్పుడు  కాంగ్రెస్ 11 సార్లు అధికారానికి వచ్చిందని  ఏమి చేయలేదని  ఒక సమస్య పరిష్కరించని బిజెపికి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలని ప్రజలను ప్రశ్నించడం  ఆశ్చర్యానికి గురిచేస్తుంది . ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు తెలంగాణ వాసులు  వివక్షతకు గురైనారు కనుకనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు  సొంత రాష్ట్రం ఏర్పడితే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయనే కదా మనం పోరాడినది.  అలాంటప్పుడు ఉమ్మడి పాలన గురించి  తెలంగాణ రాష్ట్రానికి అన్వ విస్తే ప్రయోజనం ఏముంటుంది?
  అందుకే మంచి చేసినా చెడు చేసినా ప్రజల ఆకాంక్షలను విస్మరించినా  ప్రజల విశ్వాసానికి గoడి కొట్టినా
 ఆ బాధ్యత అంతా బారాస పార్టీ మోయవలసి ఉంటుంది  . గత తొమ్మిదిన్నర సంవత్సరాలకు పైగా 
రాష్ట్రాన్ని పాలించినటువంటి ప్రస్తుత ప్రభుత్వం  ఎంచుకున్న అంశాలు,  మదిలో ఉంచుకున్న ఆకాంక్షలు,  ఇచ్చిన హామీలు, చేసిన ప్రలోభాలు వాగ్దానాలు  ఏ మేరకు అమలు చేసినారు ప్రజల ముందు  సమాధానం చెప్పుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిది.  భయపెట్టే ధోరణితో గారడీ మాటలతో  ఇతర రాజకీయ పార్టీల మీద బురదజల్లే నె పంతో  ప్రజలను ప్రశ్నించకుండా చేసే  కుట్ర  నిజంగా ప్రజలను ఆగం చేస్తుందనడం లో సందేహం లేదు.
  అందుకే ప్రజలు తమకు ఇచ్చినటువంటి హామీలు  ఏ మేరకు అమలయినాయో  ఆలోచించుకొని  ప్రతి అంశాన్ని ఎన్నికల సందర్భంగా బారాస పార్టీని, నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఎక్కడికక్కడ నిలదీయవలసిన అవసరం ఉంది.  అదే సందర్భంలో మిగతా రాజకీయ పార్టీలను కూడా  అధికారంలోకి వస్తే ఏం చేస్తారు  మీ మేనిఫెస్టోలో ఉన్న ప్రజా సమస్యలు ఏమిటి అని  ప్రతిఘటించడం చాలా అవసరం.
     బారాస ప్రభుత్వాన్ని నిలదీయ వలసిన అంశాలు ఏమిటి :-

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ,పెన్షన్లు, కేసీఆర్ కిట్,  రైతుబంధు, దళిత బంధు, రుణమాఫీ  వంటి  ప్రత్యక్షంగా డబ్బులను పంపిణీ చేసే పథకాలను  విధానపరమైన అంశాలుగా  భావించి ప్రభుత్వము అమలు చేస్తున్న తీరు  నిజంగా పరిపాలన కాదు . వి దానపరమైన అంశాలను ముందు పెట్టుకొని  నిర్దిష్టమైనటువంటి రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేయవలసిన అవసరానికి  భిన్నంగా  ప్రజాధనాన్ని విచ్చలవిడిగా  వివిధ వర్గాలకు పంపిణీ చేసి  అదే పరిపాలన అంటే ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా లేరు అని గుర్తించడం అవసరం .
-- ఉమ్మడి రాష్ట్రంలో 17 నుండి 11 శాతం మధ్యలో విద్యా రంగానికి బడ్జెట్ కేటాయిస్తే  సొంత రాష్ట్రంలో6 శాతానికి  దిగజారడంలో అర్థమేమిటి  ?
--గుట్టల ప్రకృతి   విధ్వంసాన్ని వ్యతిరేకించి  స్వరాష్ట్రంలో  అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు రాజకీయ నాయకులే విధ్వంసానికి పాల్పడుతుంటే  మీ హామీ ఏమైనట్లు ?
-- టీవీ సినిమా సంస్కృతి  లోప భూయిష్టంగా తెలంగాణ సంస్కృతికి భిన్నంగా  ఉన్నదని విమర్శించి  అధికారానికి వచ్చిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఎందుకు ?
-- రైతులకు ఉచితంగా ఎరువులను పంపిణీ చేస్తామని మాట ఇచ్చి అమలు చేయలేదేందుకు?
--  విద్యా వైద్యం, సామాజిక న్యాయం, ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు,  మౌలిక వసతు ల విషయంలో  ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా నాణ్యమైన పద్ధతిలో కొనసాగిస్తామని ఇప్పటికీ  హామీ ఇవ్వలేదు కారణం ఏంటి ?
--- ఇండ్లు లేని వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మాట ఇచ్చి  హామీ అమలు చేయకపోగా  పంపిణీ చేసిన ఇల్లు కూడా  ఉద్యోగులకు ఇండ్లు ఉన్నవారికి  మాత్రమే పంపిణీ చేయడం  మీ  అసమర్థతకు నిదర్శనం కాదా ?
-- ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాన్ గతంలో కొనసాగిన దానిని  తెలంగాణ ప్రభుత్వంలో రద్దుచేసి  ఆ వర్గాలకు నష్టం చేసింది నిజం కాదా?
--  మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని  అనుత్పాదక రంగాలలో విచ్చలవిడిగా పెట్టుబడిదారులు భూస్వాములకు  అప్పనంగా ప్రజాధనాన్ని దారాదత్తం చేసి  5 లక్షల కోట్ల పైచిలుకు  అప్పుల రాష్ట్రంగా  చేయడానికి మీరు బాధ్యులు కాదా?ex.పంటపందని భూములకు కూడా రైతుబందు ఇవ్వడం ద్రోహ మే. 
---  ఉద్యోగాలను భర్తీ చేసి  ఖాయిలా పడిన పరిశ్రమలను తెరిపించి  ప్రభుత్వ రంగంలో కొత్త పరిశ్రమలు  ప్రారంభించే బదులు  ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి బాధ్యత విస్మరించినది నిజం కాదా?
--  విద్యను ప్రభుత్వ రంగంలో కొనసాగించే బదులు  ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వడం ఎవరి ప్రయోజనం కోసం ? హై స్కూల్ స్థాయి వరకు 60 శాతం విద్యార్థులు ప్రైవేటు స్కూల్లోనే  ఫీజుల మోత భరించలేక అభ్యసిస్తుంటే  నియంత్రణ చట్టం తీసుకురాకపోవడం  సంగతేమిటి?
--  ఆరోగ్య తెలంగాణ పేరుతో ప్రకటనలు  కనీస సౌకర్యాలు ప్రభుత్వ వైద్యశాలలో కరువై  ప్రభుత్వమే ప్రైవేటు వైద్యశాలలకు  మౌలిక వసతులను కల్పిస్తూ  ప్రోత్సహించడం ఎవరి ప్రయోజనం కోసం?
---  దళిత బంధు అమలు ఒక డ్రామా అయితే  లక్షాధికారులు భూస్వాములు ఉద్యోగులకు కూడా ఆ పథకాన్ని అమలు చేయడం ఒక పెద్ద నేరం కాగా  కేవలం పార్టీ కార్యకర్తలకు అమలు చేసినట్లు వస్తున్న విమర్శలకు సమాధానం ఏమిటి ? 30%  శాసనసభ్యులు లేదా పార్టీ వర్గాలు  కమిషన్లు తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత  ?
--బీసీ బంధు లక్ష కే పరిమితం చేసి  15 కులాలకు మాత్రమే వర్తింపజేసి  రెండు లక్షల ఆదాయానికే  అర్హత ప్రకటించినప్పుడు  ఎవరి ప్రయోజనం కోసం  ఈ బీసీ బందు అమలు చేస్తున్నారు?
--  గృహలక్ష్మి పథకంలో  స్థలం ఉన్న వారికి  చాలీచాలని 3 లక్షలు మాత్రమే ప్రకటించి  మంజూరి కోసం కమిషన్లు తీసుకున్నట్టు వచ్చిన వార్తలు,  సరిపోని  మూడు లక్షల సంగతేమిటి ?
-- ఉద్యోగులు  పెన్షనర్లకు  వేతనాలు  సకాలంలో చెల్లించక  చెల్లించవలసిన బకాయిలను  వివిధ బిల్లులను ఆమోదించక  ఇబ్బందులకు గురి చేస్తున్నది నిజం కాదా?
--  ఆర్టీసీ కార్మికులను  విలీనం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న పిఆర్సి డిఏ బకాయిలను చెల్లించకపోవడంలో ఉన్న ఔచిత్యం ఏమిటి ?
-- ఆర్టీసీ లోను ఇతరత్రా  సంఘాల ప్రాధాన్యతను తగ్గించి  నిషేధించినది నిజం కాదా?
--  ప్రజాస్వామ్యాన్ని కూనిచేసి  నిరసన తెలిపే ఇందిరాపార్కును రద్దుచేసి  ఉద్యమకారుల  ఆగ్రహానికి గురైన విషయం వాస్తవం కాదా ?
-- ప్రతి శాసనసభ్యుడు కూడా ముఖ్యంగా అధికార పార్టీ వాళ్లు  భూ ఆక్రమణలు అవినీతికి పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలపై  విచారణ ఏది? ప్రభుత్వ సమాధానం ఏమిటి ?
-- ప్రాజెక్టులు,  ఇండ్లు,  కాలువలు ,వాటర్ ట్యాంకులు,  దేవాలయాలు ,చివరికి సచివాలయము కూడా  నాణ్యత లోపం గా ఉన్నట్లు  వెలువడిన ప్రకటనలకు ప్రభుత్వ సమాధానం ఏమిటి?  కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై  నాణ్యతా లోపంపై విచారణకు ఆదేశించలేదు ఎందుకు ?
-- 2000 రూపాయల పెన్షన్  షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇతరత్రా పెన్షన్ల వంటి కొన్ని రాయితీలను మాకు ఇచ్చి  కోట్ల రూపాయలు మీరు అక్రమంగా  సంపాదించిన విషయాన్ని  మేము ఎలా అంగీకరిస్తాము  విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది  .
---ప్రభుత్వ భూముల అమ్మకాలు , వివిధ కుల సంఘాలు ట్రస్టీలు  ఇతర ఆధ్యాత్మిక సంస్థలకు నామమాత్ర,  ఉచితంగా   కట్టబెట్టిన విషయం పైన  విచారణ జరిపించాలి వాస్తవం తెలియచేయాలి.
--,సమానత్వo సాధించేక్రమంలో తీసుకున్న చర్యలేవి?
- రైతులకు హుస్నాబాద్,ఖమ్మంలో బేడీలు వేసినచరిత్ర మీ ది.ఇదేనా రైతుప్రభుత్వం?

      ఇలాంటి పలు పరిపాలనకు సంబంధించిన అంశాలలో   లోపాలు జరిగినట్లు  పత్రికల్లో  చూస్తూనే ఉన్నాం.  ఇటువంటి అవకతవకలను ప్రస్తావించకుండా ప్రభుత్వము ముఖ్యమంత్రి మంత్రులు  తెలంగాణ తెచ్చింది తామేనని,  హ్యాట్రిక్ ప్రభుత్వం కావాలని ,మరో 10 ఏళ్ల పాటు కొనసాగుతామని  నమ్మబలికే ప్రయత్నం చేస్తుంటే  పైన నిర్దేశించిన పలు ప్రశ్నలకు  ప్రభుత్వం  బుద్ధి జీవులు మేధావుల సమక్షంలో సమాధానం చెప్పి  తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి.  ఎన్నికల్లో ప్రజలు  అధికార పార్టీని శాసనసభ్యులను ప్రజానాయకులను  ఎక్కడికక్కడ నిలదీసి  తప్పు చేసిన చోట తరిమికొట్టవలసినటువంటి అవసరం ఉన్నది . అప్పుడు మాత్రమే  ప్రభుత్వం  జరిగిన లోటుపాట్లను,  అమలు కాని అంశాలను,  హామీ ఇచ్చి విస్మరించిన తీరును  ప్రజల సమక్షంలో అంగీకరిస్తే  భవిష్యత్తుకు  నాంది అవుతుంది.  ప్రత్యామ్నాయ శక్తులుగా కొత్త ప్రభుత్వానికి రావడానికి ఉత్సుకత చూపుతున్న రాజకీయ పార్టీలకు కూడా  ఈ ప్రశ్నలు  చెక్ పెడతాయనడంలో సందేహం లేదు.  అవినీతికి వ్యతిరేకంగా  అధికార పార్టీ ఆగడాలకు  ముగింపుగా  రాజ్యాంగబద్ధ హక్కులను  సాధించుకునే క్రమంలో  యాచించడం కాదు  శాసించే స్థాయికి ఎదగాలని  సామాన్య ప్రజానీకాన్ని కోరుకుందాం . ప్రజలను ప్రభువులు గా చూడవలసిన పాలకులు  బానిసలుగా మార్చుకొని  స్వారీ చేయడాన్ని  ఇక ఏమాత్రం కూడా సహించకూడదు .ఆ రకమైనటువంటి  ప్రజా ఉద్యమం,  ప్రజాస్వామ్య సంస్కరణ,  అవినీతిపై పోరుబాట తెలంగాణ రాష్ట్రంలోనే ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రారంభం కావాలని ఆశిద్దాం  .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమనేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)