అక్రమ ఇసుక రవాణా చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

నాగారం, 25 జూన్ 2022 తెలంగాణవార్త ప్రతినిధి  : ఎటువంటి అనుమతులు లేకుండా నాగారం మండల పరిధిలోని పేర బోయిన గూడెం బిక్కేరు వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పేర బోయిన గూడెం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నట్లు శనివారం పత్రికా ప్రకటనలో తెలిపారు. ఇసుక రవాణా కొరకు కాంట్రాక్టర్ చిత్తలూరి రెవెన్యూ పరిధిలో అనుమతి పొంది, అక్రమంగా పేర బోయిన గూడెం పరిధినుండి ఇసుక రవాణాకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  లారీల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ సిబ్బంద చూసి చూడనట్టు వ్యవహరించడంలో ఆంతర్యమేమిటని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధిక లోడుతో లారీలు రోడ్డుపైన వెళ్లడంతో గుంతలు ఏర్పడి గ్రామంలోకి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తలూరి రెవిన్యూ పరిధిలో అనుమతి పొంది ఉన్నారు కాబట్టి ఆ పరిధి నుండి రవాణా చేసుకోనెల చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు కోరుతున్నామని అన్నారు. లేనిపక్షంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని గ్రామ ప్రజలు రైతులు  హెచ్చరించారు.